కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు!

  • సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్త కార్యక్రమం
  • రాజకీయ నేపథ్యం లేని యువతకు సువర్ణావకాశమన్న మహేశ్ గౌడ్
  • టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తామన్న పీసీసీ చీఫ్

రాజకీయాల్లోకి సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం గాంధీ భవన్‌లో పార్టీ తరఫున వినూత్నమైన ‘టాలెంట్ హంట్’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా ప్రకటించారు. ప్రజా జీవితంలోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతీ యువకులకు కాంగ్రెస్ పార్టీ ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోందని, దేశ నిర్మాణంలో యువత ప్రధాన పాత్ర పోషించాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల నుంచే ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.


ఇది సాధారణ పార్టీ చేరికల లాంటి కార్యక్రమం కాదని, సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరినీ వారి రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా ఆహ్వానిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ టాలెంట్ హంట్ ద్వారా పార్టీ అధికారిక ప్రతినిధులను పూర్తిగా పారదర్శకమైన పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై బలమైన అవగాహన ఉండటం, లౌకికవాదం పట్ల పూర్తి నిబద్ధత కలిగి ఉండటం, సామాజిక సేవపై నిజమైన ఆసక్తితో పాటు ప్రజలతో సమర్థవంతంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉన్నవారిని ఈ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు.


సాంప్రదాయ రాజకీయ సంబంధాలు లేకపోయినా కేవలం ప్రతిభ, స్పష్టమైన విజన్, సేవా దృక్పథం ఉన్న మంచి వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఈ వేదికను అందిస్తోందని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా, క్షేత్రస్థాయి నుంచి సరికొత్త రక్తాన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ వేసిన ఈ అడుగు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశావహ యువతలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.



Mahesh Kumar Goud
Telangana Congress
Congress Talent Hunt
Youth in Politics
Rahul Gandhi
Political Opportunity
Gandhi Bhavan
TPCC
Telangana Politics
Social Service

More Telugu News